
పోటీ పరీక్షల్లో ఓడిపోయి, డిప్రెషన్ లోకి వెళ్ళబోతున్న తన కుమారుడికి, ఓ తండ్రి చెప్పిన జీవిత సత్యం.
“జీవితం కూడా ఒక బాక్సింగ్ రింగ్ వంటిదే నాన్నా! ప్రతీ క్షణమూ, పరిస్థితులు అనే ప్రత్యర్థి పంచులు విసురుతూనే ఉంటాడు. ఒక్కోసారి మనం పడిపోవచ్చు. పడిపోయినంత మాత్రాన మనం ఓడినట్టు కాదు నాన్నా! ఇంకా మనకు అవకాశం ఉంటుంది. మనం పడిపోగానే ఓడిపోయినట్టుగా, రెఫరీ ప్రకటించడు. మనం కోలుకుని నిలబడడానికి సమయం ఇస్తాడు. పది వరకు అంకెలు లెక్కబెడతాడు. అప్పటికీ లేవలేకపోతే, అవతలి వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాడు.
జీవితంలో కూడా అంతే! మనం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటాము. సమస్య రాగానే, ఓడిపోయామని కృంగిపోకూడదు. భగవంతుడు సమయం ఇస్తాడు. పది వరకు లెక్కబెడతాడు. నిన్ను నిలబెట్టడానికి అనేక మార్గాలు చూపిస్తాడు. వాటిని మనం అందిపుచ్చుకోవాలి. సమర్థుడైన వాడు పది లెక్క పెట్టే లోగానే లేచి నిలబడి, గెలుస్తాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనప్పుడు అంటే పది లెక్కపెట్టే లోగా మనం లేవలేక పోయినప్పుడు మాత్రమే ఓటమిని అంగీకరించాలి.
అది కూడా ఓకే. ఒక్కోసారి ఓడి పోతాం. ఫర్వాలేదు. ఇంకో పోటీ, ఇంకో మార్గం ఉండనే ఉంటుంది.
చాలా మంది ‘కెరటం నా ఆదర్శం, పడినందుకు కాదు పడి లేచినందుకు!’ అని అంటుంటారు. కానీ, పడిన కెరటం, లేచిన కెరటం ఒకటి కాదని వారికి తెలియదు. విరిగి పడిన కెరటం ఛిద్రమై, పతనమై మామూలు నీటిలో కలిసిపోతుంది, అస్థిత్వాన్ని కోల్పోతుంది. మళ్ళీ కొత్త కెరటం పుట్టాలంటే ఆ ప్రక్రియకు ఎంతో కృషి అవసరం.
కొత్త జలరాశి సరికొత్త గాలిని నింపుకుని, దిశను ఎన్నుకుని, మెల్లగా ప్రారంభించి రానూరానూ వేగాన్ని పుంజుకుని, తీరాన్ని మహోద్ధృతంగా చేరుకుంటుంది. అది కొత్త కెరటం. దాని శక్తి అనంతం.
మనిషి కూడా అంతే నాన్నా! ప్రతీ పతనం నుండి తేరుకుని, కొత్త కెరటంలా, నూతన శక్తితో తనను తాను ఆవిష్కరించుకోవాలి. ఈ తరం యువతీయువకులకు ఆ సామర్థ్యం ఉంది.”
కుమారుడు కన్నీళ్ళమయమయి, జెండా కర్రలా లేచి నిలబడి తండ్రిని కౌగలించుకుని,
“ఔను నాన్నా! నేను మళ్ళీ ప్రయత్నిస్తాను” అని అన్నాడు.
… ఈ కథ ద్వారా మనకు ఒక మంచి విషయం అర్థమైంది.💥💥💥💥